జగ్గయ్యపేట, యువ గళం న్యూస్: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఇల్లు దెబ్బతిని ఇబ్బందుల్లో పడిన జర్నలిస్టుకు పారామౌంట్ అధినేత సురేష్ అండగా నిలిచారు. జగ్గయ్యపేట ప్రెస్ క్లబ్ సీనియర్ సభ్యులు, షేర్ మహమ్మద్ పేట గ్రామానికి చెందిన అన్నెపాక శ్రీనివాసరావు స్వగృహం వర్షాల ధాటికి తీవ్రంగా దెబ్బతింది. ఈ విషయం తెలుసుకున్న ప్రెస్ క్లబ్ ప్రతినిధులు బుధవారం ఉదయం ఆయన నివాసానికి చేరుకుని, దెబ్బతిన్న గృహాన్ని, వర్షం వల్ల జరిగిన నష్టాన్ని స్వయంగా పరిశీలించారు. తోటి జర్నలిస్టుకు తామంతా ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
బాధితుడికి తక్షణ సహాయం
తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న శ్రీనివాసరావు పరిస్థితిని ప్రెస్ క్లబ్ సభ్యులు పారామౌంట్ అధినేత సురేష్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై ఆయన వెంటనే స్పందించి, ఇంటి పైకప్పునకు అవసరమైన రేకులతో పాటు ఇతర నిర్మాణ సామాగ్రిని అందజేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. జర్నలిస్టు కుటుంబానికి సాయం అందించిన సురేష్‌కు ప్రెస్ క్లబ్ ప్రతినిధులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
పాత్రికేయుల సమస్యలపై నిరంతరం పోరాడటంతో పాటు, వారి సంక్షేమ కార్యక్రమాల కోసం ప్రెస్ క్లబ్ ఎల్లప్పుడూ ముందుంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అల్లి రవిచంద్, పాత్రికేయ నాయకులు ముత్యాల సైదేశ్వర రావు, కట్టా గురువయ్య, ఆనంద్, నజీర్ భాష, అల్లి సత్యనారాయణ, అంబోజి శివాజీ, కాకనబోయిన శివరామకృష్ణ, వత్సవాయి మండల ప్రెస్ క్లబ్ ఆధ్యక్షులు బుర్రి వెంకట్, చేని రాంబాబు, శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.