పంట భీమాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి: మండల వ్యవసాయ అధికారి జి సత్యనారాయణ బుర్రి వెంకట్ యువ గళం న్యూస్ ఎడిటర్

వత్సవాయి, జూలై 15: ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలంలోని మంగోళ్లు, దేచుపాలెం గ్రామాలలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన "పొలం పిలుస్తోంది" కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి G. సత్యనారాయణ పాల్గొని, ఖరీఫ్–2026 పంటల భీమా పథకాన్ని (క్రాప్ ఇన్సూరెన్స్) రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయినప్పుడు రైతులకు ఆర్థిక రక్షణ కల్పించే ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన (PMFBY), సవరించిన వాతావరణ ఆధారిత పంట బీమా పథకం (RWBCIS) కింద రైతులు తమ ఆధార్, బ్యాంకు, భూ వివరాలతో మీసేవ లేదా కామన్ సర్వీస్ సెంటర్లలో నమోదు చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఎకరాకు రైతు వాటా ప్రీమియం గడువుల వివరాలను తెలుపుతూ.. పత్తి పంటకు ₹1,900 (చివరి తేదీ: 24-07-2026), మిరపకు ₹1,800 (31-07-2026), మొక్కజొన్నకు ₹370 (31-07-2026), మరియు వరి పంటకు ₹850 (15-08-2026) గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుత ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా ఉన్నందున, పత్తి పంట రక్షణకు లీటరు నీటికి 10 గ్రాముల చొప్పున 13:0:45 లేదా 19:19:19 కలిపి పిచికారీ చేయాలని, అలాగే తక్కువ నీటితో పండే పంటలను ఎంచుకుంటూ సూక్ష్మ నీటి పారుదల, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించాలని సూచించారు. అనంతరం APAIMS యాప్ ద్వారా ఎరువుల పంపిణీ విధానంపై అవగాహన కల్పించిన ఈ కార్యక్రమంలో ఆర్బీకే ఇంచార్జి వెంకటేష్, పశు సంవర్ధక శాఖ సిబ్బంది సురేష్, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది రాణి మరియు రైతులు పాల్గొన్నారు.