పెనుగంచిప్రోలులో అధ్వానంగా ఆర్‌ అండ్‌ బీ రహదారులు రెండేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్న జనం ‘గుంతల’ బాటపై గుండెలు చేతపట్టుకుని ప్రయాణాలు అధికారుల నిర్లక్ష్యంపై పెల్లుబుకుతున్న ఆగ్రహం

పెనుగంచిప్రోలు యువ గళం న్యూస్ : అది రోడ్డా?.. లేక మృత్యుకూపమా? అక్కడ ప్రయాణించడమంటే ప్రాణాలతో చెలగాటం ఆడటమే! అడుగు తీసి అడుగు వేస్తే గుంతలు.. కాస్త వేగం పెంచితే దుమ్ము మేఘాలు! రెండేళ్లుగా ఆర్‌ అండ్‌ బీ రహదారులు అధ్వానంగా మారినా శాశ్వత పరిష్కారం కనిపించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెనుగంచిప్రోలు మండలం నుంచి ముచ్చింతాల, పాతవేమవరం, అనిగండ్లపాడు, గుమ్మడిదుర్రు గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారులు పూర్తిగా దెబ్బతిని ప్రయాణికులకు నరకయాతనగా మారాయి. ప్రతిరోజూ వందలాది ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, బస్సులు ఈ మార్గంలో ప్రయాణిస్తున్నప్పటికీ రహదారుల పరిస్థితి రోజురోజుకూ మరింత దిగజారుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు ముందు ఈ రహదారులకు చేపట్టిన మరమ్మతులు తాత్కాలికంగానే పరిమితమయ్యాయని స్థానికులు చెబుతున్నారు. అనంతరం కురిసిన భారీ వర్షాలు, వరదల ప్రభావంతో రోడ్లు మరింత దెబ్బతిని పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయని పేర్కొంటున్నారు. ప్రస్తుతం కొన్ని చోట్ల మట్టి కొట్టుకుపోయి కంకర రాళ్లు బయటపడటంతో ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి కిందపడే ఘటనలు జరుగుతున్నాయని అంటున్నారు. ఎండాకాలంలో దుమ్ము, వర్షాకాలంలో బురదతో ప్రయాణం మరింత దుర్భరంగా మారుతోందని వాపోతున్నారు.

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతి రోజు వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ ప్రధాన రహదారులపైనే వారి రాకపోకలు సాగుతాయి. రోడ్లపై ఏర్పడిన లోతైన గుంతల కారణంగా భక్తులు, వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో గుంతలు స్పష్టంగా కనిపించక ప్రమాదాల ముప్పు మరింత పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామాల నుంచి రైతులు వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించడంలో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు ప్రతిరోజూ ఈ రహదారులపైనే ప్రయాణించాల్సి వస్తుండటంతో అసౌకర్యం తప్పడం లేదని పేర్కొంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌ల రాకపోకలకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు.

ఈ రహదారుల గుండా ప్రతిరోజూ అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రయాణిస్తున్నప్పటికీ శాశ్వత మరమ్మతులు చేపట్టకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలిక మరమ్మతులతో కాకుండా నాణ్యమైన బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే ప్రజా ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.