వేదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన భూముల కౌలు, టెండర్ల వేలం పూర్తి: రూ. 2.58 లక్షల ఆదాయం

జగ్గయ్యపేట (వేదాద్రి) యువ గళం న్యూస్: ఎన్.టి.ఆర్ జిల్లా, జగ్గయ్యపేట మండలం, వేదాద్రి గ్రామములో వేంచేసియున్న యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థాన కార్యాలయంలో గురువారం (ది.11-06-2026) దేవదాయ శాఖ నందిగామ డివిజన్ తనిఖీదారు జి. పవన్ కళ్యాణ్, ఆలయ కార్యనిర్వహణాధికారి కానూరి సురేష్ బాబు, వంశపారంపర్య ధర్మకర్త డాక్టర్ వెలగపూడి లక్ష్మణఇందిరా దత్తు ప్రతినిధి రామ్ ప్రసాద్ సమక్షంలో కౌలు భూముల బహిరంగ వేలం, నిత్యావసరాల సరఫరాకు సీల్డ్ టెండర్లు నిర్వహించారు. దేవస్థానానికి చెందిన 43.13 ఎకరాల కౌలు భూములకు సంబంధించి మొత్తం ‘9’ బిట్లకు గాను ‘6’ బిట్లకు బహిరంగ వేలం నిర్వహించగా, గత ఏడాది కంటే హెచ్చు పాటలతో రూ.2,58,000/- ఆదాయం సమకూరిందని, మిగిలిన ‘3’ బిట్లకు ఎవరూ పాల్గొనకపోవడంతో వేలం వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా దేవస్థానానికి ఏడాది కాలపరిమితికి గాను కిరాణా సరుకుల సరఫరాకు '2', కూరగాయలకు '5', పూలు-పూల దండల సరఫరాకు '4' టెండర్లు వచ్చాయని, ఈ టెండర్ల నివేదికలను దేవదాయ శాఖ ఉన్నతాధికారుల ఆమోదానికి పంపామని, వారి ఉత్తర్వుల మేరకు త్వరలోనే ‘లోయస్ట్ టెండరు’ దారులను ఖరారు చేస్తామని కార్యనిర్వహణాధికారి కానూరి సురేష్ బాబు ఒక ప్రకటనలో తెలియజేశారు.